ఇంజిన్ పై కవర్ లేకుండా ముంబయి నుంచి భుజ్ ప్రయాణించిన విమానం

  • అలయన్స్ ఎయిర్ విమానానికి ఊహించని పరిణామం
  • టేకాఫ్ తీసుకుంటుండగా ఊడిన ఇంజిన్ కౌల్
  • అప్రమత్తం చేసిన ఏటీసీ అధికారులు
  • అంతా బాగానే ఉందని బదులిచ్చిన పైలెట్లు
ప్రతి ప్రయాణానికి ముందు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అయితే అలయన్స్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానానికి ఊహించని పరిణామం ఎదురైంది. ముంబయి నుంచి గుజరాత్ లోని భుజ్ వెళ్లిన ఆ విమానాన్ని కూడా ప్రయాణానికి ముందు అలాగే తనిఖీ చేశారు. కానీ టేకాఫ్ సమయంలో ఇంజిన్ పైన ఉండే కవర్ (కౌల్) ఊడిపోయి రన్ వేపై పడింది. అయితే పైలెట్లు అలాగే భుజ్ వెళ్లిపోయారు.

ముంబయి విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు ఈ విషయంలో ఆ విమాన పైలెట్లను అప్రమత్తం చేశారు. మీ విమానం నుంచి ఏదైనా విడిభాగం ఊడిపోయిందా? అని అడిగారు. ఆ పైలెట్లు అలాంటిదేమీ లేదని, తమ విమానానికి ఏమీ కాలేదని బదులిచ్చారు.  

అయితే, ఇంజిన్ కౌల్ లేకుండానే భుజ్ చేరుకున్న ఆ విమానానికి, తదుపరి ప్రయాణం కోసం తనిఖీలు చేస్తుండగా, ఇంజిన్ పైభాగం ఊడిపోయిన సంగతి అప్పుడు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఆ ఇంజిన్ కవర్ ను ముంబయి ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సిద్ధమైంది.


More Telugu News