కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై విచారణ డివిజన్ బెంచ్ కు బదిలీ

  • హిజాబ్ ధరించిన విద్యార్థినులు
  • అభ్యంతరం తెలిపిన విద్యాసంస్థ యాజమాన్యం
  • హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు
  • గత రెండ్రోజులుగా సింగిల్ బెంచ్ లో విచారణ
కర్ణాటకలో కొందరు అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాల తరగతులకు హాజరు కావడం తీవ్ర వివాదం రూపుదాల్చింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. కాగా, హిజాబ్ ధరించి వచ్చిన తమను విద్యాసంస్థ యాజమాన్యం అనుమతించకపోవడం పట్ల ఓ మతానికి చెందిన ఐదుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత రెండ్రోజులుగా విచారణ జరిపిన సింగిల్ బెంచ్... ఈ అంశాన్ని డివిజన్ బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.

వాదనల సందర్భంగా... విద్యార్థుల విశ్వాసాలను విద్యాసంస్థల యాజమాన్యాలు గౌరవించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు హాజరయ్యేలా ఊరట కలిగించాలని కోరారు. ప్రభుత్వం స్పందిస్తూ, విద్యార్థులందరూ ఒకే డ్రెస్ కోడ్ పాటించాలని స్పష్టం చేసింది. వాదనలు విన్న పిమ్మట కర్ణాటక హైకోర్టు ఈ కేసును రేపటి నుంచి డివిజన్ బెంచ్ విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.

కాగా, హిజాబ్ వివాదం తీవ్ర నిరసన జ్వాలలకు కారణమవుతుండడంతో, ప్రభుత్వం ఆందోళనలపై నిషేధం విధించింది. బెంగళూరు నగర వ్యాప్తంగా విద్యాసంస్థల గేట్లకు 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, గుమికూడడం వంటివి చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ నేడు పలు విద్యాసంస్థల వద్ద విద్యార్థులు హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించి పోటాపోటీ ప్రదర్శనలు నిర్వహించారు.


More Telugu News