కరోనా వైరస్ పై కొత్త అస్త్రం.. చికిత్స కోసం తొలి నాసల్ స్ప్రే విడుదల

  • ఫ్యాబిస్ప్రే పేరుతో ఆవిష్కరణ
  • నైట్రిక్ ఆక్సైడ్ తో తయారీ
  • ముక్కులోనే వైరస్ ను చంపేస్తుంది
  • ఊపిరితిత్తుల్లోకి వెళ్లనీయదు
  • గ్లెన్ మార్క్ ఫార్మా ప్రకటన
పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో ముందుండే గ్లెన్ మార్క్ ఫార్మా.. కరోనా చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్) ఔషధాన్ని సైతం ఈ సంస్థ అన్ని కంపెనీల కంటే ముందుగా రోగులకు అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. తాజాగా ‘ఫ్యాబి స్ప్రే’ పేరుతో నాసల్ స్ప్రేను విడుదల చేసింది. ఇందుకు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం పొందింది.

ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. కరోనా వైరస్ లోడ్ ను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు గ్లెన్ మార్క్ ఫార్మా చెబుతోంది. ‘‘ఫేస్ 3 పరీక్షల్లో వైరల్ లోడ్ ను 24 గంటలలో 94 శాతం మేర, 48 గంటలలో 99 శాతం మేర తగ్గిస్తున్నట్టు తేలింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే సురక్షితమైనది’’ అని సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ముక్కులో స్ప్రేను కొట్టుకుంటే శ్వాస వ్యవస్థలోకి వెళ్లకుండా వైరస్ ను అడ్డుకుంటుందని గ్లెన్ మార్క్ అంటోంది. ‘‘శ్వాసకోస వ్యవస్థ ఎగువ భాగంలోనే వైరస్ ను చంపేసే లక్ష్యంతో ఫ్యాబి స్ప్రేను అభివృద్ది చేయడం జరిగింది. దీనికి యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు రుజువైంది. కరోనా వైరస్ మరిన్ని వైరస్ కణాలను ఉత్పత్తి చేసుకోకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది’’ అని గ్లెన్ మార్క్ తెలిపింది.


More Telugu News