శ్రీలంకతో టెస్టుల్లో సాహాకు బదులు తెలుగు కుర్రాడు.. మనస్తాపంతో కీలక నిర్ణయం తీసుకున్న వృద్ధిమాన్​ సాహా!

  • రంజీ సిరీస్ కు దూరమవుతున్నట్టు ప్రకటన
  • బెంగాల్ క్రికెట్ టీం సెలెక్టర్లకు కబురు
  • టీమిండియాకు దూరమవడం వల్లే ఈ నిర్ణయమంటున్న బెంగాల్ టీమ్ మేనేజ్ మెంట్ అధికారి
  • సాహాకు బదులు భరత్ కు శ్రీలంక టెస్ట్ టూర్ లో అవకాశం
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 4 నుంచి శ్రీలంకతో మొహాలి వేదికగా జరగబోయే టెస్టు సిరీస్ కు ఎంపిక కాకపోవడంతో.. త్వరలో జరగనున్న రంజీ మ్యాచ్ లకు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగాల్సిన 37.6 ఏళ్ల అతడు.. ‘వ్యక్తిగత కారణాల’ వల్ల ఈసారికి అందుబాటులో ఉండడం లేదంటూ సెలెక్టర్లకు కబురంపాడు. టీమిండియాకు ఎంపిక కాకపోవడం వల్లే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘‘టెస్టులకు ఎంపిక చేయడం లేదని జట్టు యాజమాన్యంలోని కొందరు పెద్ద వ్యక్తులు వృద్ధిమాన్ కు కరాఖండిగా చెప్పేశారు. ఇక చాలు.. రిషభ్ పంత్ కు బ్యాకప్ గా ఓ కొత్త ఆటగాడిని ఎంపిక చేస్తామని సాహాకు స్పష్టంగా వివరించారు’’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. తెలుగు కుర్రాడు కె.ఎస్. భరత్ కు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకే శ్రీలంక సిరీస్ కు ఎంపిక చేయలేకపోతున్నామని బీసీసీఐ అధికారులు సాహాకు చెప్పారని తెలిపారు. ఆ కారణం వల్లే ప్రస్తుత రంజీ సీజన్ కు దూరమవుతున్నట్టు సాహా ప్రకటించి ఉంటాడని చెప్పారు.

అయితే, టీమిండియాకు 40 టెస్టులు ఆడిన తర్వాత కూడా ఎంపిక చేయకపోవడంతోనే సాహా మనస్తాపం చెందాడని బెంగాల్ టీమ్ మేనేజ్ మెంట్ లోని అధికారి ఒకరు చెప్పారు. టీమిండియాకే ఆడకుంటే రంజీ ట్రోఫీలు ఆడి ఏం లాభమనే అతడు దూరమై ఉంటాడని తెలిపారు. కాగా, ఇప్పటిదాకా 40 టెస్టులాడిన సాహా.. 1,353 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలున్నాయి. వికెట్ కీపర్ గా 104 మందిని పెవిలియన్ కు పంపాడు. అందులో 92 క్యాచులు, 12 స్టంపింగులున్నాయి.


More Telugu News