పోటాపోటీగా ఏపీ, తెలంగాణ విద్యుదుత్పత్తి.. డెడ్‌స్టోరేజీకి చేరుకున్న శ్రీశైల జలాశయం

  • తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న కేఆర్ఎంబీ
  • నిబంధనలు బేఖాతరు చేసిన ఇరు రాష్ట్రాలు
  • 35 టీఎంసీలకు పడిపోయిన నిల్వలు
తాగు, సాగునీటి అవసరాలున్నప్పుడు మాత్రమే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేసిన సూచనలను పక్కనపెట్టేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేశాయి. ఫలితంగా శ్రీశైల జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయాయి.

  దీంతో వచ్చేది వేసవికాలం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు నీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్‌లో ఒక్క శ్రీశైలం వాటానే చెరో 40 శాతంగా ఉండడం గమనార్హం.

నిజానికి తాగు, సాగునీటి అవసరాల కోసమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఐదు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్ఎంబీ లేఖలు రాసింది. ఆ సమయానికి  శ్రీశైలంలో 856.10 అడుగుల నీటి మట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండేవి. అయితే, ఇరు రాష్ట్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో నిన్న సాయంత్రానికి ఈ నిల్వలు 35.51 టీఎంసీలకు పడిపోయాయి. ఈ వాటర్ ఇయర్‌లో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగా, అప్పుడే జలాశయం ఖాళీ కావడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News