‘పీఎం కేర్స్’కు వెల్లువెత్తిన విరాళాలు

  • 2020 మార్చి 27న ఏర్పాటు
  • ఐదు రోజుల్లోనే రూ.3,076 కోట్లు
  • 2020-21లో 10,990 కోట్లు
  • 2021 మార్చి నాటికి రూ.7,014 కోట్ల బ్యాలెన్స్
ప్రధాన మంత్రి సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ (పీఎం కేర్స్) ఫండ్.. కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత దేశ ప్రజల నుంచి వచ్చే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధి. ఈ నిధికి 10,990 కోట్ల విరాళాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చాయి.

స్వచ్చంద విరాళాల రూపంలో రూ.7,183 కోట్లు రాగా, విదేశాల నుంచి రూ.494 కోట్లు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాలు ఇవి. ఈ నిధి నుంచి రూ.3,976 కోట్లను సహాయ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. రూ.1,311 కోట్లను భారత్ లో తయారైన వెంటిలేటర్ల కొనుగోలుకు వెచ్చించారు. వీటిని ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారు.

2020 మార్చి 27న పీఎంకేర్స్ ఫండ్ ను ప్రారంభించగా.. మార్చి 31 నాటికి ఐదు రోజుల్లోనే రూ.3,076 కోట్లు సమకూరడం గమనార్హం. ఆసుపత్రుల ఏర్పాటు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధిని వినియోగించారు. 2021 మార్చి నాటికి పీఎంకేర్స్ ఫండ్ బ్యాలన్స్ రూ.7,014 కోట్లుగా ఉంది.


More Telugu News