కేజ్రీవాల్, యోగి మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్

  • పార్ల‌మెంటులో మోదీ ప‌చ్చి అబద్ధాలు చెప్పారన్న కేజ్రీవాల్
  • క‌రోనా వేళ‌ ప్రజల బాధపై రాజకీయాలు చేయడం స‌రికాద‌ని ట్వీట్
  • కేజ్రీవాల్ స‌ర్కారు యూపీ కార్మికులను బలవంతంగా పంపింద‌న్న యోగి
  • యూపీ ప్రజల మృతదేహాలు నదుల్లో తేలాయ‌న్న కేజ్రీవాల్
పార్లమెంటులో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే.  కరోనా వేళ‌ వలస కూలీలు ఎదుర్కొన్న ఇబ్బందుల‌కు మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలే కార‌ణ‌మంటూ మోదీ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్, బీహార్‌లకు ముంబై, ఢిల్లీ నుంచి వెళ్లి ఆయా రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాపింపజేసేలా ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు బలవంతంగా పంపాయ‌ని చెప్పుకొచ్చారు.

దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కౌంట‌ర్ ఇచ్చారు. మోదీ ప‌చ్చి అబద్ధాలు చెప్పారని, కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారి గురించి, మృతుల కుటుంబాల గురించి ఆయ‌న‌ సున్నితంగా ఉంటారని దేశ ప్రజలు భావించారని కేజ్రీవాల్ చెప్పారు. అయితే, అందుకు భిన్నంగా ప్రజల బాధపై రాజకీయాలు చేయడం స‌రికాద‌ని ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ ఓ వైపు
ప్ర‌జ‌లంద‌రూ కరోనా వ‌ల్ల ఇబ్బందులు పడుతుంటే, మ‌రోవైపు, కేజ్రీవాల్ స‌ర్కారు యూపీ కార్మికులను బలవంతంగా ఢిల్లీ నుంచి పంపించింద‌ని విమ‌ర్శించారు.

ఢిల్లీ ప్రభుత్వ అప్రజాస్వామిక, అమానవీయ చర్యల వల్ల చిన్నారులు, మహిళలు కూడా అర్ధరాత్రి యూపీ సరిహద్దుల్లో దిక్కుతోచ‌ని వారిలా నిలబడాల్సి వచ్చిందని అన్నారు. కేజ్రీవాల్ మానవతాద్రోహి అని యోగి ఆదిత్య‌నాథ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ అబద్ధాల కోరని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని మోదీ గురించి అగౌరవంగా మాట్లాడిన కేజ్రీవాల్ దేశానికి క్షమాపణలు చెప్పాలని యోగి ఆదిథ్య‌నాథ్ డిమాండ్‌ చేశారు.

దీంతో యోగి ఆదిత్య‌నాథ్ వ్యాఖ్య‌ల‌పై కేజ్రీవాల్ స్పందించారు. యూపీ ప్రజల మృతదేహాలు నదుల్లో తేలుతుంటే, యోగి ఆదిత్య‌నాథ్ మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని కేజ్రీవాల్ మండిప‌డ్డారు. ఆయ‌న‌లాంటి దయలేని, క్రూరమైన పాలకుడిని తాను ఎన్న‌డూ చూడలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 


More Telugu News