పెళ్లి బృందానికి ప్రమాదం అత్యంత శోచనీయం: పవన్ కల్యాణ్

  • అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోవడం కలచి వేస్తోంది
  • ఒకే కుటుంబంలోని ఐదుగురు మరణించడం మరింత బాధాకరం
  • మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉరవకొండ మండలం బూదగవి వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఎంతో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి స్వగ్రామానికి కారులో వెళ్తున్న బీజేపీ నాయకుడు కోకా వెంకటప్ప నాయుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం మరింత బాధాకరమని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని... మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.


More Telugu News