ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ

  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరు
  • శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగం
  • వివిధ దేశాల పరిశోధకులకు అభినందనలు
  • ఇక్రిశాట్ రాబోయే 25 ఏళ్ల లక్ష్యం నిర్దేశించుకోవాలన్న మోదీ
ఇక్రిశాట్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వారికి సూచించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు.

రైతులకు లబ్ది చేకూర్చేలా వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడే సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదపడాలని అభిలషిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

భారత్ లో 80 శాతం మంది రైతులు చిన్న కమతాలు సాగుచేస్తున్న వారేనని తెలిపారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు. సన్నకారు రైతులు సైతం పుంజుకునేలా వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని వివరించారు.

వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టామని, డిజిటల్ అగ్రికల్చర్ తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు సాధ్యమని వెల్లడైందని మోదీ వివరించారు. సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలని అన్నారు. సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ పంట దిగుబడులు పెరిగేలా చూడాలని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేసుకోవాలని వివరించారు. ఇక్రిశాట్ కూడా సాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.

దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించబోతున్నామని ప్రధాని వెల్లడించారు. పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అందుకోబోతున్నామని, పామాయిల్ సాగుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆహార భద్రత సాధించామని, మిగులు ధాన్యాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే భారత రైతుల జీవన ప్రమాణాలు మరింత పెరగాలని అన్నారు.


More Telugu News