అమెజాన్ ఒక్కరోజు ఆదాయం రూ.14.26 లక్షల కోట్లు.. యాపిల్ రికార్డును బ్రేక్ చేసిన సంస్థ

  • 13.54 శాతం పెరిగిన షేరు విలువ
  • ఏడేండ్లలో ఇదే భారీ పెరుగుదల
  • ఫేస్ బుక్ ఆదాయం పెరగకపోవచ్చన్న మెటా
చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా రూ.18 లక్షల కోట్లు నష్టపోయి నిన్న ఫేస్ బుక్ వరస్ట్ రికార్డ్ నమోదు చేస్తే.. ఒక్కరోజులోనే అత్యధికంగా సంపాదించి అమెజాన్ ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. అవును, చరిత్రలోనే ఏ కంపెనీ సాధించలేని ఘనతను శుక్రవారం అమెజాన్ చేసి చూపించింది. ఇన్న ఒక్కరోజే అమెరికాలో అమెజాన్ షేర్ విలువ 13.54 శాతం పెరగ్గా.. కంపెనీ విలువ మరో 19,100 కోట్ల డాలర్లు పెరిగింది. అంటే నిన్న ఒక్కరోజే అమెజాన్ సుమారు రూ.14.26 లక్షల కోట్లను ఆర్జించింది.

తద్వారా గత వారం యాపిల్ సృష్టించిన 18,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.13.51 లక్షల కోట్లు) రికార్డును అమెజాన్ బద్దలు కొట్టింది. సంస్థ షేర్ విలువలో ఏడేండ్లలోనే నిన్న భారీ పెరుగుదల నమోదైంది. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వ ధరలను పెంచుతామన్న ప్రకటనల నేపథ్యంలోనే సంస్థ షేర్ విలువ పెరిగిందని నిపుణులు అంటున్నారు.

కాగా, మదుపరులు ఆకర్షణీయమైన సేవల జోలికి వెళ్లడం లేదని, దీంతో ఫేస్ బుక్ రెవెన్యూ (రాబడి) పెరుగుదల తక్కువగా ఉండే అవకాశం ఉందని ‘మెటా’ వెల్లడించింది. గురువారం సంస్థ షేర్ విలువ 26 శాతం పడిపోయి.. 23,200 కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలి కాలంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఐఎన్ సీ షేర్లు బాగా లాభపడుతున్నాయి. ఆయా సంస్థల నిర్ణయాలతో ఎస్ అండ్ పీ 500 సూచీలో ఎత్తుపల్లాలు నమోదవుతున్నాయి.


More Telugu News