పీవీ న‌ర‌సింహారావును సైతం ఓడించిన బీజేపీ తెలంగాణ‌ నేత జంగారెడ్డి క‌న్నుమూత‌.. మోదీ సంతాపం

  • అనారోగ్య కార‌ణాల‌తో తుదిశ్వాస‌
  • ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల   
  • జంగారెడ్డి కుమారుడికి ప్రధాని మోదీ ఫోన్ 
  • సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్  
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) అనారోగ్య కార‌ణాల‌తో ఈ రోజు ఉద‌యం కన్నుమూశారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన జంగారెడ్డికి ఎంత‌గా ప్ర‌జాభిమానం ఉందో చెప్ప‌డానికి 1984లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ గెలుపును ఉదాహ‌ర‌ణగా తీసుకోవ‌చ్చు.

ఆ ఏడాది దేశంలో జ‌రిగిన సాధారణ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో చందుప‌ట్ల‌ జంగారెడ్డి ఒకరు. హనుమకొండ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో ఆయన గెల‌వ‌డం గ‌మ‌నార్హం. ఆ ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, ఉమ్మ‌డి ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొంది స‌త్తా చాట‌గా, బీజేపీ ఏ మాత్రం రాణించ‌లేక‌పోయింది.

అటువంటిది ఆ పార్టీ నుంచి గెలుపొందిన నాయ‌కుడిగా జంగారెడ్డి నిలిచి త‌న బ‌లం ఏంటో నిరూపించుకున్నారు. ఉమ్మ‌డి ఏపీలో అప్ప‌ట్లో 30 సీట్లు సాధించిన ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగు దేశం కేంద్రంలో కీల‌క పాత్ర పోషించింది. కాంగ్రెస్ త‌ర్వాత అత్య‌ధిక సీట్లు సాధించిన పార్టీగా టీడీపీ నిలిచిన విష‌యం తెలిసిందే.

కాగా, జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ ప‌నిచేశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. జంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ‌ నేత‌లు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకున్నారు.

జంగారెడ్డి మృతి బీజేపీకి తీర‌నిలోట‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. బీజేపీ వ్య‌వ‌స్థాప‌కుల్లో జంగారెడ్డి ఒక‌ర‌ని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపార‌ని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయ‌న కుమారుడికి మోదీ ఫోన్ చేశార‌ని, ఆయ‌న కుటుంబాన్ని ఫోనులో ప‌రామ‌ర్శించార‌ని తెలియజేశారు. 


More Telugu News