గవర్నర్‌ను హామీగా పెట్టి వేల కోట్లు అప్పు తెచ్చే స్థాయికి ఏపీ ప్రభుత్వం దిగజారింది: రాజ్యసభలో కనకమేడల

  • మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి దానిపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చారు
  • సీఎం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం దివాలా
  • మాట్లాడుతుండగానే ముగిసిన సమయం
  • సోమవారం తిరిగి కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షాత్తు గవర్నర్‌ను హామీగా పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే స్థాయికి దిగజారిపోయిందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడుతూ రవీంద్ర కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, అవినీతి, పరిపాలన వైఫల్యం కారణంగా ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారని, కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఏకంగా 3.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇప్పటికీ ప్రతి రోజూ అప్పుల కోసం పాకులాడుతోందని అన్నారు.

మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మద్యంపై వచ్చే 25 ఏళ్లలో రాబోయే ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కనకమేడల మాట్లాడుతున్న సమయంలో సమయం ముగిసిపోవడంతో తిరిగి సోమవారం ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వనున్నట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.


More Telugu News