1000వ వన్డే మ్యాచ్ కు సిద్ధమవుతున్న టీమిండియా... శుభాకాంక్షలు తెలిపిన సచిన్

  • అరుదైన ఘనత ముంగిట టీమిండియా
  • ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన వైనం
  • విండీస్ తో ఆదివారం నాటి మ్యాచ్ 1000వ వన్డే
  • అభినందనలు తెలిపిన సచిన్
టీమిండియా మరో అరుదైన ఘనతకు చేరువైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 6) నాడు వెస్టిండీస్ తో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో 1000వ వన్డే ఆడుతున్న తొలి జట్టు టీమిండియానే. గత 47 ఏళ్లుగా టీమిండియా వన్డే క్రికెట్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు.

1000వ వన్డే మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా టీమిండియాకు, బీసీసీఐకి, భారత మాజీ క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. ఇదొక చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఈ అద్భుత ప్రయాణంలో ప్రస్తుత ఆటగాళ్లు, మాజీలు, అభిమానులు, భారత క్రికెట్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములేనని సచిన్ పేర్కొన్నారు.

కాగా, భారత జట్టు తన తొలి వన్డే పోటీని 1974 జులై 13న ఇంగ్లండ్ తో ఆడింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఆనాటి మ్యాచ్ లో భారత్ ఓడింది. భారత్ ఇప్పటివరకు 999 వన్డేలు ఆడి 518 విజయాలు నమోదు చేసింది. 431 మ్యాచ్ ల్లో ఓటమి పాలవగా, 41 మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి. 9 మ్యాచ్ లు టై అయ్యాయి. భారత జట్టు తన 500వ వన్డేని 2002లో ఆడింది. రెండు దశాబ్దాల అనంతరం ఇప్పుడు 1000వ వన్డేలో ఆడనుంది.


More Telugu News