సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు

  • సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల సమావేశం
  • నేరుగా సచివాలయానికి వెళ్లిన మంత్రులు
  • పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీతో సమావేశం
  • చర్చల్లో పాల్గొన్న సజ్జల
సీఎం జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మంత్రుల బృందం నేరుగా సచివాలయానికి వెళ్లింది. అక్కడ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశమైంది. మంత్రుల బృందంలో బొత్స, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

సమస్యలు, డిమాండ్లపై ఇప్పటివరకు తాము చెప్పాల్సింది చెప్పేశామని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీకి స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించినందున ఇక ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని వారు పేర్కొన్నారు.

కాగా, ఉద్యోగులకు హెచ్ఆర్ఏ శ్లాబులకు సంబంధించిన నివేదికను అందించాలని మంత్రుల బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యపై సీఎం ఆలోచిస్తున్నారని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రులు తెలిపారు. అయితే దీనిపై తమకు లిఖితపూర్వక హామీ కావాలని ఉద్యోగులు పట్టుబట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News