జూనియర్ జట్టుతో కోహ్లీ చిట్ చాట్.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు విలువైన సలహాలు

  • యువ ఆటగాళ్లతో ఆన్ లైన్ లో మాటా మంతీ
  • జీవితం, క్రికెట్ గురించి సలహాలు చెప్పాడన్న ప్లేయర్లు
  • రేపు ఆంటిగ్వాలో ఇంగ్లండ్ తో ఫైనల్
సెమీస్ లో ఆసీస్ ను కొట్టేసి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లోకి దూసుకెళ్లిపోయారు జూనియర్లు. ఇంగ్లండ్ తో రేపు ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్ లో టైటిల్ పోరుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిలో ఉత్సాహం, స్ఫూర్తి నింపేందుకు విరాట్ కోహ్లీ.. వారితో మాట్లాడాడు. ఆన్ లైన్ లో యంగ్ ప్లేయర్లతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని అండర్ 19 ఆఫ్ స్పిన్నర్ కౌశల్ తంబే.. ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి వెల్లడించాడు.

ఫైనల్ పోరు నేపథ్యంలో విలువైన సలహాలు ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేశాడు. ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగార్గేకర్ కూడా ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసి తన మనసులోని భావాల్ని పంచుకున్నాడు. కోహ్లీతో ఇంటరాక్ట్ అవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. జీవితం, క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నానంటూ కామెంట్ చేశాడు. రాబోయే రోజుల్లో అవి తమకు ఎంతో మేలు చేస్తాయని చెప్పాడు.

కాగా, యశ్ ధూల్ నేతృత్వంలోని జూనియర్ల జట్టు వరల్డ్ కప్ లో స్థిరంగా రాణిస్తోంది. హైదరాబాదీ బ్యాటర్ షేక్ రషీద్ కూడా తన ప్రదర్శనతో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాగా, వెస్టిండీస్ లో జరుగుతున్న వరల్డ్ కప్ కు వెళ్లేముందు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోనూ జూనియర్ జట్టు ఇంటరాక్ట్ అవ్వడం విశేషం.



More Telugu News