పెరుగుతున్న నిరుద్యోగం.. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే..!

  • 2020 మార్చి 1 నాటికి కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న 8.72 లక్షల ఉద్యోగాలు
  • రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • యూపీఎస్సీలో 485 పోస్టుల ఖాళీ
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భారీగా పెరిగిపోతున్నా... వాటిని భర్తీ చేసే ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. 2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 8,72,243 ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానాన్ని ఇచ్చారు.

2018 మార్చి 1 నాటికి 6,83,823 ఉద్యోగాలు, 2019 మార్చి 1 నాటికి 9,10,153 ఉద్యోగాలు ఖాళీగా ఉండేవని కేంద్ర మంత్రి తెలిపారు. 2018-19, 2020-21లో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా 2,65,468 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో సివిల్ సర్వీసెస్ కోసం నిర్వహించే యూపీఎస్సీలో 485 పోస్టులు, గ్రూప్ ఏ కేడర్ లో 21,255 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు.

మరోవైపు 2021 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించిన త్రైమాసిక ఉపాధి సర్వే రెండో రౌండ్ ఫలితాల ప్రకారం... ఆర్థిక వ్యవస్థలోని ఎంపిక చేసిన తొమ్మిది రంగాలలో ఉపాధి 3.1 కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిర్వహించిన తొలి రౌండ్ లో ఇది 3.08 కోట్లుగా ఉందని చెప్పింది. 2021లో కరోనా కారణంగా నిరుద్యోగం పెరిగిందని వెల్లడించింది.


More Telugu News