అందుకే బుమ్రాను జ‌ట్టులోకి తీసుకున్నాం: ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపిన భ‌ర‌త్ అరుణ్

  • 2018లో దక్షిణాఫ్రికా పర్యటన
  • నెట్స్‌లో అద్భుతంగా రాణించాడు
  • కోహ్లీ కూడా ఆశ్చ‌ర్య‌పోయాడు
  • సెలెక్ట‌ర్ల‌తో మాట్లాడి బుమ్రాను తీసుకున్నాం
టీమిండియా కీల‌క‌ బౌల‌ర్ జస్ప్రిత్‌ బుమ్రా 2018లో దక్షిణాఫ్రికా పర్యటన ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌డం అనూహ్యంగా జరిగిందని టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ చెప్పారు.  ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. 2018 దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ప్రాక్టీస్ చేస్తోన్న స‌మ‌యంలో నెట్స్‌లో బుమ్రా సాధన చూసి విరాట్‌ కోహ్లీ ఆశ్చర్యపోయాడని చెప్పారు.

నెట్స్‌లో బౌలర్ల అందరి కంటే బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని కోహ్లీ త‌మ‌కు చెప్పాడని అన్నారు. దీంతో  బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడని తెలిపారు. ఇక ఆ వెంటనే బుమ్రా కెరీర్  మారిపోయిందని వివ‌రించారు. బుమ్రా వన్డేల్లో ఆడేటప్పుడే టెస్టు క్రికెట్‌లో రాణించాలని ఉందని త‌న‌కు చెప్పాడ‌ని భ‌రత్ గుర్తు చేసుకున్నారు.

అత‌డు క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని అన్నాడ‌ని వివ‌రించారు. ఈ విషయాన్ని తాను కోచ్‌ రవిభాయ్‌కి చెప్పాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బుమ్రాను టెస్టుల్లో ఆడిస్తే టీమిండియాకు బాగా ఉప‌యోగ‌డ‌ప‌డ‌తాడ‌ని ఆయ‌న కూడా అన్నార‌ని చెప్పారు.

దీంతో 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రాకు టెస్టుల్లో తొలిసారి అవకాశం ఇవ్వాలని అనుకున్నామ‌ని, కోహ్లీ కూడా సెలెక్టర్లతో మాట్లాడి అతడిని తొలి టెస్టులో ఆడించాడని తెలిపారు. చివ‌ర‌కు ఆ సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణించాడు. మూడు టెస్టుల్లో మొత్తం 14 వికెట్లు తీసి జ‌ట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జ‌ట్టులో నంబర్‌ వన్‌ పేసర్‌గా రాణించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బుమ్రా 27 టెస్టులు ఆడి, 113 వికెట్లు తీసి జ‌ట్టులో కీల‌క బౌల‌ర్ గా నిలిచాడు.


More Telugu News