నిర్ణయం మార్చుకున్న తెలంగాణ ఆర్టీసీ.. అదనపు బాదుడు షురూ!

  • దసరా, సంక్రాంతికి అదనపు చార్జీలు వసూలు చేయని టీఎస్ఆర్టీసీ
  •  జనవరిలో రూ. 51 కోట్ల మేర తగ్గిన ఆదాయం
  • ముచ్చింతల్‌కు నడిపే బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం
  • సమ్మక్క-సారలమ్మ జాతర బస్సులపై త్వరలోనే నిర్ణయం
దసరా, సంక్రాంతి సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే బస్సులు నడిపిన తెలంగాణ ఆర్టీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. దసరా, సంక్రాంతి సమయంలో అదనపు చార్జీలు లేకుండానే బస్సులు నడపడం వల్ల రూ. 75 నుంచి రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతో మనసు మార్చుకుంది.

ఈ క్రమంలో ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల కోసం హైదరాబాద్ నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే, తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఈ నెల 13 నుంచి నడపనున్న ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపైనా నిర్ణయం వెలువడనున్నట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది జనవరిలో టీఎస్ ఆర్టీసీ రూ. 337.79 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈసారి రూ. 51 కోట్లు తగ్గి రూ. 287.07 కోట్లకు పడిపోయింది. అంతేకాదు, డిసెంబరు నాటి ఆదాయం కంటే కూడా రూ. 65.55 కోట్ల ఆదాయం తగ్గినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


More Telugu News