ఉద్యోగులు దుమ్ములేపారు: 'ఛలో విజయవాడ'పై సోమిరెడ్డి స్పందన

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమం
  • నేడు ఛలో విజయవాడకు భారీ స్పందన
  • లక్ష మంది వచ్చారని ఉద్యోగ సంఘ నేతల వెల్లడి
  • ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలన్న సోమిరెడ్డి
ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా ఉద్యోగులు భారీగా తరలిరావడంతో ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఉద్యోగులు దుమ్ములేపారంటూ కితాబునిచ్చారు.

రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. పోలీసులతో అరాచకం సృష్టించి అడుగడుగునా ఆటంకాలు కల్పించినా ఉద్యోగులు లక్షలాదిగా తరలివచ్చారని ప్రశంసించారు. ఉద్యోగుల ఉద్యమస్ఫూర్తి ముందు ప్రభుత్వ కుట్రలు పటాపంచలయ్యాయని వివరించారు.

ఉద్యోగులకు ప్రజల మద్దతు లేదంటూ సకలశాఖల మంత్రి సజ్జల వ్యాఖ్యానిస్తున్నారని, అయితే, దారిపొడవునా ఉద్యోగులకు మంచి తాగునీరు అందిస్తూ వారి దాహార్తి తీర్చిన బెజవాడ ఆడపడుచులు సజ్జలకు చక్కటి సమాధానమిచ్చారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని హితవు పలికారు. ఉద్యోగుల కోసం మహిళలు బిందెల్లో నీరు తీసుకువచ్చిన వీడియోను కూడా సోమిరెడ్డి పంచుకున్నారు.


More Telugu News