ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేశాక ఆపాలనడం సరికాదు: మంత్రి బొత్స

  • మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు
  • పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • నేడు లక్షమందితో ఛలో విజయవాడ
  • చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని బొత్స హితవు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీగా ఛలో విజయవాడకు తరలివచ్చిన నేపథ్యంలో ఏపీ మంత్రులు తమ బాణీ వినిపిస్తున్నారు. తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చర్చలకు మంత్రుల కమిటీ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ ఉద్యోగులు చర్చలకు రాకుండా ఆందోళనలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. ఉద్యోగుల జీతాలను ఇప్పటికే ప్రాసెస్ చేశామని, ఈ దశలో జీతాలు ఆపాలని కోరడం సరికాదన్నారు.

పీఆర్సీ అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉద్యోగులు చర్చలకు వచ్చి ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటికైనా చర్చలకు అవకాశం ఉందని, ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఉద్యోగుల నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం, పోలీసులు సంయమనంతో వ్యవహరించినట్టు బొత్స తెలిపారు. అయితే తాము కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని చెప్పామని పేర్కొన్నారు.

కొత్త రాష్ట్రం అయినప్పటికీ తాము ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు ప్రకటించడంపైనా బొత్స మండిపడ్డారు. ఉద్యోగులకు చంద్రబాబు ఉద్ధరించింది ఏంటంట? అని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే మిన్నగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చామని మంత్రి స్పష్టం చేశారు.


More Telugu News