'ఛలో విజయవాడ' విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఛలో విజయవాడ
  • లక్ష మంది వచ్చారన్న సూర్యనారాయణ
  • మరో 3 లక్షల మందిని పోలీసులు అడ్డుకున్నారని వెల్లడి
పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో చేపట్టిన 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి ఉద్యోగులు తరలిరావడం తెలిసిందే. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.

మరో నేత బండి శ్రీనివాసరావు స్పందిస్తూ, ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను చర్చలకు పిలవాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ నేరుగా చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని, సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలని బండి శ్రీనివాసరావు కోరారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఛలో విజయవాడ కార్యక్రమం చూశాక అయినా ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.

ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తాము ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని బొప్పరాజు వెల్లడించారు.


More Telugu News