రూ.50 ల‌క్ష‌ల విలువజేసే ఇళ్ల‌ను పేద‌ల‌కు ఉచితంగా ఇస్తున్నాం: కేటీఆర్

  • హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ప‌థ‌కం కింద ఇళ్లు
  • త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ప్రారంభించిన‌ కేటీఆర్
  • రూ.9,714 కోట్లతో హైద‌రాబాద్‌లో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు
హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌, ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూం ప‌థ‌కం కింద నిర్మించిన ఇళ్ల‌ను తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో క‌లిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. మెయిన్ సెంటర్ పాయింట్‌లో ఈ ఇళ్లు క‌ట్టామ‌ని, మార్కెట్‌లో ఒక్కో ఇంటి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుంద‌ని, వాటిని తాము పేద‌ల‌కు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.

రూ.9,714 కోట్లతో హైద‌రాబాద్‌లో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నామని చెప్పారు. కొల్లూర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయ‌న తెలిపారు. అక్క‌డ‌ ఒకే చోట 15,640 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఇక తెలంగాణలో మొత్తం 18 వేల కోట్ల రూపాయలతో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడా ఇలాంటి ఇళ్ల‌ను నిర్మించడం లేదని ఆయ‌న అన్నారు. పేద‌ల కోసం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఫంక్షన్‌ హాల్‌ కోసం రూ.100 కోట్ల విలువచేసే స్థలం కేటాయించామ‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఖైర‌తాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఐదు అంతస్తుల్లో 5 బ్లాక్‌ల‌లో నిర్మించారు. ఇందులో సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించారు.


More Telugu News