పిల్లలకు పాఠాలే కాదు.. ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెపుతాం: ఏపీ మహిళా ఉపాధ్యాయులు

  • విజయవాడలో కదం తొక్కుతున్న ఉద్యోగులు
  • మా గోడు వినండి సీఎం గారూ అంటూ మహిళా ఉద్యోగుల పాటలు
  • ప్రభుత్వ తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని మండిపాటు
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతోంది. వేలాది మంది ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. న్యాయబద్ధమైన తమ హక్కులను కాలరాయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులను అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి వేలాది మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డు వైపు వెళ్తున్నారు.

మరోవైపు ప్రభుత్వ తీరును మహిళా ఉద్యోగులు తప్పుబడుతున్నారు. మా గోడు వినండి ముఖ్యమంత్రి గారూ అంటూ పాటల రూపంలో వేడుకుంటున్నారు. సలహాదారుల మాట వినకుండా, తమ గోడు వినాలని విన్నవిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని అన్నారు.

తాము పిల్లలకు పాఠాలు చెపుతాం... ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని... దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పిన జగన్... ఇప్పుడు తాడేపల్లిలోని నివాసానికే పరిమితమయ్యారని విమర్శించారు.


More Telugu News