బాబు సుపారీ మీడియా.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలనూ వక్రీకరించింది: విజయసాయిరెడ్డి

  • రాజధాని ఏర్పాటుపై రాష్ట్రానిదే స్వేచ్ఛ
  • కేంద్రం వందోసారి చెప్పిందన్న వైసీపీ ఎంపీ
  • అయినా అమరావతే రాజధాని అంటూ బాకా ఊదుతున్నారని మండిపాటు
ఏపీ రాజధాని విషయంలో పత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజధానిపై పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి చేసిన కామెంట్లను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్ర ప్రభుత్వం వందోసారి స్పష్టంగా చెప్పింది. అయినా, చంద్రబాబు సుపారీ మీడియా.. కేంద్ర మంత్రి జవాబును వక్రీకరించింది. అమరావతే రాజధాని అంటూ హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పినట్టు బాకా ఊదడం బాబు మెప్పుకోసం కాకపోతే మరేమిటి?’’ అంటూ ఆయన మండిపడ్డారు.  

కాగా, ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు, టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్షాలు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్లూ వ్యక్తమయ్యాయి. రైతులు పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లును వాపస్ తీసుకున్న ప్రభుత్వం.. కొత్త బిల్లును తెస్తామంటూ కొన్ని నెలల క్రితం ప్రకటన చేసింది.


More Telugu News