ఫేస్ బుక్ కు ఒక్కో యూజర్ నుంచి రూ.366.. భారత్ లో యూజర్ల వృద్ధి తగ్గుముఖం

  • కరోనా తీవ్రత ప్రభావం
  • ఇతర సంస్థల నుంచి పెరిగిన పోటీ
  • ప్రధాన పోటీదారు టిక్ టాక్
  • ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పెరగని యూజర్లు
ఫేస్ బుక్ (మెటా)కు అతిపెద్ద మార్కెట్ భారత్. కానీ, 2021 చివరి మూడు నెలల్లో భారత్ లో యూజర్ల వృద్ధి తగ్గుముఖం పట్టినట్లు ఈ సంస్థ ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా మెటా సీఎఫ్ వో డేవ్ వెహెనర్ ఈ వివరాలు వెల్లడించారు. 2021 డిసెంబర్ లో పెరిగిన డేటా చార్జీల ప్రభావం పడినట్టు చెప్పారు. ప్రధాన టెలికం కంపెనీలు టారిఫ్ లను గణనీయంగా పెంచడం తెలిసిందే.

కరోనా తీవ్రత పెరిగిపోవడం ఆసియాతో పాటు,  ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నిదానించేందుకు కారణమైనట్టు చెప్పారు. దేశం వారీగా గణాంకాలను ప్రకటించలేదు. భారత్ లో ఫేస్ బుక్ కు 35 కోట్ల యూజర్లు ఉన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్లు 127 కోట్లుగా ఉన్నారు. కానీ, 2021 జులై-సెప్టెంబర్ కాలంలోనూ ఇంతే మంది ఉండడం గమనార్హం. రోజువారీ యాక్టివ్ యూజర్లు సైతం ఫ్లాట్ గా 80 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రకటనల రూపంలో 6.24 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ఒక్కో యూజర్ నుంచి ఈ సంస్థకు వచ్చే ఆదాయం 4.30 డాలర్ల నుంచి 4.89 డాలర్లకు (రూ.366) పెరిగింది.

ఇతర యాప్స్ నుంచి పోటీ ప్రతికూల ప్రభావం చూపించిందని ఫేస్ బుక్ తెలిపింది. టిక్ టాక్ తమకు ప్రధాన పోటీగా ఉన్నట్టు ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ పేర్కొన్నారు.


More Telugu News