ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ 'తగ్గేదే లే' అంటారా?: 'పుష్ప' సినిమాపై గరికపాటి ఫైర్

  • 'తగ్గేదే లే' డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి
  • హీరో, డైరెక్టర్ ను నాకు సమాధానం చెప్పమనండి
  • వారిద్దరినీ అక్కడే కడిగి పారేస్తాను
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ను సైతం ఈ చిత్రం షేక్ చేసింది. హిందీలో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరింది. దక్షిణాది సినిమాల పవర్ ఏంటో బాలీవుడ్ కు చూపించింది. ఈ సినిమాలో హీరోను ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారు. అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదే లే' డైలాగ్ చాలా పాప్యులర్ అయింది.

మరోవైపు ఈ చిత్రంపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు సినిమాల గురించి కూడా తెలుసని చెప్పారు. 'పుష్ప' సినిమాలో హీరోను స్మగ్లర్ గా చూపించారని.. చివరి ఐదు నిమిషాల్లో హీరోను మంచిగా చూపిస్తామనో లేదా రెండో పార్టులో మంచిగా చూపిస్తామనో అంటారని... రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని ప్రశ్నించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ 'తగ్గేదే లే' అనడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఓ కుర్రాడు ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదే లే అంటున్నాడని... దీనికి కారణం ఎవరని అడిగారు. ఈ డైలాగ్ తనకు కోపం తెప్పిస్తోందని అన్నారు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ సినిమా హీరోని కానీ, డైరెక్టర్ ని కానీ తనకు సమాధానం చెప్పమనండని అన్నారు. వారిద్దరినీ అక్కడే కడిగిపారేస్తానని చెప్పారు. 'తగ్గేదే లే' అనే డైలాగ్ ను శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటివారు వాడాలని... అంతేకానీ, ఒక స్మగ్లర్ ఎలా వాడతాడని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై 'పుష్ప' టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


More Telugu News