ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. ఒప్పించడానికి రంగంలోకి దిగిన రెండు ప్రాంచైజీలు!

  • ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగించిన గేల్ 
  • వేలం తుది జాబితాలో కనిపించని క్రిస్ గేల్ పేరు
  • ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175 నాటౌట్) ఇప్పటికీ అతనిదే!  
యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈసారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకోవడం అభిమానులకు తీరని నిరాశ మిగిల్చింది. ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం జరగనుండగా బీసీసీఐ నిన్న 590 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో క్రిస్ గేల్, బెన్‌స్టోక్స్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్ల పేర్లు మిస్సయ్యాయి.

ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగించిన గేల్ పేరు జాబితాలో లేకపోవడంతో అభిమానులు షాకయ్యారు. ఈ మెగాటోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175 నాటౌట్) ఇప్పటికీ అతడి పేరున భద్రంగా ఉంది. ఆరు సెంచరీలతో అత్యధిక శతకాల రికార్డు కూడా గేల్ పేరునే ఉంది. అలాంటి గేల్ పేరు ఐపీఎల్ వేలం జాబితాలో లేకపోవడంతో గతంలో అతడు ప్రాతినిధ్యం వహించిన రెండు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగినట్టు ‘క్రిక్‌బజ్’ ఓ కథనాన్ని ప్రచురించింది.

అతడి పేరును కూడా లిస్ట్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు పేర్కొంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు యూనివర్స్ బాస్ ఇప్పటికే ప్రకటించాడు. క్రిక్‌బజ్ కథనంలో పేర్కొన్నట్టుగా ఆ రెండు ఫ్రాంచైజీలు గేల్‌ను ఒప్పించి వేలం జాబితాలో అతడి పేరు చేర్చితే కనుక అభిమానులకు అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు.


More Telugu News