విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసు.. మచిలీపట్టణం జైలుకు వినోద్ జైన్

  • నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • నిందితుడు మీ వాడేనంటూ వైసీపీ, టీడీపీ నేతల ఆరోపణలు
  • బాధిత కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
  • పార్టీ తరపున లాయర్‌ను ఏర్పాటు చేస్తామని భరోసా
విజయవాడలో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం జైన్‌ను మచిలీపట్టణం జిల్లా జైలుకు తరలించారు.

నిందితుడు జైన్‌ను కోర్టులో హాజరు పరచడానికి ముందు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అతడిపై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా, బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయంగానూ పెను ప్రకంపనలు రేపింది. నిందితుడు జైన్ మీ పార్టీ వాడంటే, మీ పార్టీ వాడంటూ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయకులతో అతడు కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. అంతేకాదు, అతడిని కఠినంగా శిక్షించాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.

మరోవైపు, బాధిత బాలిక తల్లిదండ్రులను నిన్న ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, వంగలపూడి అనిత తదితరులు నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.


More Telugu News