ఉద్యోగుల 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదంటున్న పోలీసులు

  • మంత్రుల కమిటీతో చర్చలు విఫలం
  • ఫిబ్రవరి 3న 'ఛలో విజయవాడ'
  • 5 వేల మంది వస్తారంటున్న ఉద్యోగులు!
  • 200 మందికి మించి అనుమతి ఇవ్వలేమన్న సీపీ
తమ ఉద్యమం చూసైనా ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు... 'ఛలో విజయవాడ' కార్యక్రమం తలపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క, ఇవాళ మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చర్చలు నిరాశాజనకంగా ముగిసిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాల నేతలు ఎల్లుండి 'ఛలో విజయవాడ' కార్యక్రమ సన్నాహాల్లో మునిగిపోయారు. అయితే, 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

దీనిపై విజయవాడ సీపీ కాంతిరాణా టాటా స్పందిస్తూ, కరోనా పరిస్థితుల వల్ల ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. 'ఛలో విజయవాడ'కు 5 వేల మంది వస్తారని ఉద్యోగులు చెబుతున్నారని, కానీ బహిరంగ కార్యక్రమాలకు 200 మందికే అనుమతి ఉందని స్పష్టం చేశారు. 200 మందికి మించి హాజరైతే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుందని సీపీ స్పష్టం చేశారు. నిబంధనల దృష్ట్యా ఉద్యోగులు విజయవాడ రావొద్దని తెలిపారు.


More Telugu News