క్రిప్టోల మాదిరే ‘బ్లాక్ చైన్’ టెక్నాలజీతో డిజిటల్ రూపీ

  • 2022-23లో తీసుకురానున్న ఆర్బీఐ
  • బడ్జెట్ లో భాగంగా మంత్రి సీతారామన్ ప్రకటన
  • వ్యయాలు తగ్గుతాయి
  • సమర్థత పెరుగుతుందని ప్రకటన
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిజిటల్ రూపీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లోనే ఆచరణ రూపం దాల్చనుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

బిట్ కాయిన్, ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీయే. ఈ టెక్నాలజీ భద్రత పరంగా ఎంతో పటిష్ఠమైనది. నకిలీలకు అవకాశం ఉండదు. భవిష్యత్తు టెక్నాలజీగా దీన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ సేవల రాజధానిగా ఉన్న భారత్, క్రిప్టో కరెన్సీలను అనుమతించాలని, తద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆవిష్కరణలను ప్రోత్సహించాలంటూ ఒక వర్గం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది.

క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆహ్వానించింది. డిజిటల్ రూపీని 2022-23 సంవత్సరంలో ఆర్బీఐ తీసుకొస్తుందని మంత్రి ప్రకటించడం సానుకూలం. డిజిటల్ రూపీ ఆవిష్కరిస్తే క్రిప్టోల మాదిరే అందులో పెట్టుబడులకు వీలుంటుంది.

‘‘డిజిటల్ కరెన్సీ (రూపీ) అన్నది మరింత సమర్థవంతమైన, చౌక కరెన్సీ నిర్వహణ విధానం. కనుక బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీల సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకురావడాన్ని ప్రతిపాదిస్తున్నాం’’ అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ రూపీ అమల్లోకి వస్తే, నగదు వినియోగం మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News