యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీదే హవా.. కోటి దాటిన సబ్ స్క్రయిబర్లు

  • ప్రపంచ నేతల్లో మరెవరికీ లేనంత ఆదరణ
  • జో బైడెన్ కు 7 లక్షల మందే సబ్ స్క్రయిబర్లు
  • దేశీ నేతల్లో రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది
  • ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. ట్విట్టర్ పేజీలో ఆయన క్రేజీయే వేరు. యూట్యూబ్ లోనూ ఆయన యూజర్లను గణనీయంగానే ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ‘నరేంద్ర మోదీ’ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకున్న వారి సంఖ్య కోటి మార్క్ ను దాటింది. ఈ విషయాన్ని ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్ లో ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన ఇమేజ్ ను సైతం పోస్ట్ చేసింది. అంతర్జాతీయంగా మరే ప్రముఖ నేత కూడా యూట్యూబ్ చందాదారుల పరంగా మోదీకి సమీపంలో లేకపోవడం గమనించాలి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చానల్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య 7.03 లక్షలుగానే ఉంది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కు చందాదారులు 19 లక్షల మంది ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు 28.8 లక్షల మంది చందాదారులు ఉన్నారు. అలాగే, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ కు 30.7 లక్షల మంది, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కు 36 లక్షల మంది చొప్పున సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.

యూట్యూబ్ పై ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశీ నేతలను పరిశీలిస్తే.. రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, శశి థరూర్ కు 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, ఎంకే స్టాలిన్ కు 2.12 లక్షల మంది, మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది చొప్పున యూట్యూబ్ చానళ్లపై సబ్ స్క్రయిబర్లు కలిగి ఉన్నట్టు ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ పోస్ట్ రూపంలో ప్రకటించింది.


More Telugu News