2021లో దేశవ్యాప్తంగా 144 మందికి మరణశిక్ష

  • అత్యధికంగా యూపీలో 34 మందికి
  • ఏపీలో 13 మందికి శిక్ష 
  • తెలంగాణలో ఒకరికి మరణశిక్ష
  • 2021 చివరికి ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలు 488
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోర్టులు గతేడాది 144 మంది నేరస్థులకు మరణ శిక్షలను ఖరారు చేశాయి. అప్పటికే మరణశిక్షలు పడి, అమలు పెండింగ్ లో ఉన్న వారినీ కలిపి చూస్తే.. 2021 చివరికి మొత్తం 488 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను లా యూనివర్సిటీ, ఢిల్లీ విడుదల చేసింది. ఏటా ఈ సంస్థ గణాంకాలను విడుదల చేస్తుంటుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్టులు 2021లో 34 మందికి మరణ శిక్షలను ఖరారు చేశాయి. గతేడాది ఎక్కువ మందికి మరణ శిక్షలు పడింది ఈ రాష్ట్రంలోనే. దీంతో ఈ రాష్ట్రం నుంచి ఉరిశిక్షల అమలుకు వేచి ఉన్న ఖైదీల సంఖ్య 86కు పెరిగింది.

ఆ తర్వాత ఏపీలో 13 మందికి, తెలంగాణలో ఒకరికి స్థానిక కోర్టులు మరణ శిక్షలు విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం గతేడాది ఒక్క కేసులోనూ ఈ శిక్షను ఖరారు చేయలేదు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 2016 చివరికి 400గా ఉంటే, 2017 చివరికి 366కు తగ్గింది. 2018లో 426కు, 2019లో 378కు, 2020లో 404కు, 2021 చివరికి 488కు సంఖ్య పెరిగింది.

ఉరిశిక్షలు విధించినా, మన దేశంలో వాటి అమలు చాలా తక్కువ కేసుల్లోనే ఉంటోంది. సుదీర్ఘకాలంపాటు అప్పీళ్లతో ఉరిశిక్షల అమలు వాయిదా పడుతుంటుంది. చివరికి క్షమాభిక్ష రూపంలో శిక్ష తగ్గింపు లభిస్తుంటుంది.


More Telugu News