అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదు?: బొప్పరాజు

  • విజయవాడలో పీఆర్సీ సాధన సమితి సమావేశం
  •  ఆ నివేదికలో రహస్యమేముందన్న బొప్పరాజు 
  •  ప్రభుత్వం రకరకాల కుట్రలు పన్నుతోందంటూ ఆరోపణలు 
  • తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు  
విజయవాడలో నేడు పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. బేటీ ముగిసిన అనంతరం ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఆ నివేదికలో రహస్యమేముంది? అన్నారు.

కాగా, డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు తలపెట్టిన 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం రకరకాల కుట్రలు పన్నుతోందని బొప్పరాజు ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీన్ని గమనించాలని పిలుపునిచ్చారు. వాట్సాప్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఉద్యోగులపై పలువిధాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమను చర్చలకు పిలిచినట్టు, తామేదో రహస్యంగా కొన్నింటికి ఒప్పుకున్నట్టు, హెచ్ఆర్ఏ శ్లాబులు ఇస్తున్నట్టు తప్పుడు వార్తలు పంపిస్తున్నారని బొప్పరాజు తెలిపారు.

ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడం కోసమే కొంతమందిని నియమించారని ఆరోపించారు. అయితే ఈ వార్తలను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరూ నమ్మరాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు. 3 ప్రధాన డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు. చర్చలకు రావాలంటూ ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారని, లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తేనే చర్చలకు వెళతామని పేర్కొన్నారు.

ఉద్యోగుల జీతాలపై ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, మెమోలు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఇది అటవిక రాజ్యం కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని వెల్లడించారు. అలాకాకుండా, కక్షసాధింపు ధోరణితో అధికారులపై చర్యలు తీసుకోరాదని పేర్కొన్నారు.

కాగా, తమకు న్యాయసలహాలు ఇచ్చేందుకు రవిప్రసాద్, సత్యప్రసాద్ అనే న్యాయవాదులను నియమించుకున్నట్టు బొప్పరాజు వెల్లడించారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పిలుపునిచ్చారు.


More Telugu News