గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లు ఇప్పుడు వేయాల్సి వస్తోంది: జగన్

  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష
  • రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం
  • గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశాలు
గత టీడీపీ ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలను తమ ప్రభుత్వం చేయాల్సి వస్తోందని అన్నారు. రెండేళ్లుగా భారీ వర్షాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని... వాటి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లు ఏ దశలో కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు నిర్వహించాలని జగన్ చెప్పారు. జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని చెప్పారు.

వైయస్సార్ జలకళ కింద ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలని జగన్ సూచించారు. ఆ రిగ్గు ద్వారా రైతులకు బోర్లు వేయించాలని చెప్పారు. బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలని ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగు పరచాలని చెప్పారు. మురుగు నీరు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

నివాస ప్రాంతాల్లో మురుగు నీరు ఉండే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు. ఉపాధిహామీ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని జగన్ సూచించారు. అమూల్ పాల సేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తి చేయాలని చెప్పారు.


More Telugu News