ఇక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్.. అన్నీ ఒకే డిజిటల్ ఐడీలో!

  • గుర్తింపు కార్డులన్నింటినీ కలిపి ఒకే కార్డుగా చేసే ప్రయత్నం
  • ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయింపు
  • ప్రజాభిప్రాయం కోసం ప్రజల ముందుకు
ప్రస్తుతం దేశ ప్రజల జేబుల్లో బోల్డన్ని కార్డులు ఉంటున్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్‌పోర్టు వంటివన్నీ మోసుకెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఈ బాధ లేకుండా వీటన్నింటినీ కలిపి ఒకే డిజిటల్ ఐడీగా రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ (డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం)గా ఓ కొత్త మోడల్‌ కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం.

ఈ కార్డులన్నీ జతకట్టి ఒక్కటిగా చేసిన తర్వాత కూడా ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయిస్తారు. ఇదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును వాడుకోవచ్చు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ఐడీలన్నీ ఒకే చోట ఉంటాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిని ప్రజాభిప్రాయానికి ఉంచుతారని తెలుస్తోంది.


More Telugu News