ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు మహారాష్ట్రలో... ప్లేఆఫ్ మ్యాచ్ లు గుజరాత్ లో!

  • భారత్ లోనే ఐపీఎల్!
  • కరోనా నేపథ్యంలో పరిమిత వేదికల్లో మ్యాచ్ లు
  • త్వరలో ఆటగాళ్ల వేలం
ఐపీఎల్ తాజా సీజన్ పోటీలను ఎలాగైనా భారత్ లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. దేశంలో కరోనా కేసులు లక్షల్లో వస్తుండడంతో, పరిమిత సంఖ్యలో మైదానాల్లో మ్యాచ్ లు జరపాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు మహారాష్ట్రలో, ప్లే ఆఫ్ మ్యాచ్ లు గుజరాత్ లో నిర్వహించాలన్నది బీసీసీఐ ఆలోచన అని బోర్డు వర్గాలు తెలిపాయి. ఒకవేళ మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా మారితే అప్పుడు ఐపీఎల్ ను యూఏఈ తరలించే అవకాశాలున్నాయని వివరించాయి.

మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. ముంబయిలో వాంఖెడే స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం, నవీ ముంబయిలో డీవై పాటిల్ స్టేడియం, పూణే సమీపంలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉన్నాయి. వీటిలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తే, ప్లేఆఫ్ మ్యాచ్ లను గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరపొచ్చన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది.

అటు, ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది.


More Telugu News