తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయండి... ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మెమోలు

  • కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల జీతాలు
  • ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు పలుమార్లు ఆదేశాలు
  • ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవన్న సర్కారు
ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఏపీలో ఉద్యోగుల జీతాలపై అనిశ్చితి నెలకొంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగులు ఉద్యమిస్తుండగా, కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

అయితే, ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా ట్రెజరీ సిబ్బందికి మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

నేటి సాయంత్రం 6 గంటల్లోపు తమ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే చర్యలు ఉంటాయని పేర్కొంది. కాగా, కొత్త పీఆర్సీ ప్రకారం హెచ్ఆర్ఏను సవరించారు. విజయవాడలోని హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం పెంచారు. కాగా, ట్రెజరీ, డీడీవో సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీ చేశారు.

పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగులు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు.


More Telugu News