ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు... నటి సాయిపల్లవి అంశంపై గవర్నర్ తమిళిసై స్పందన

  • శ్యామ్ సింగరాయ్ చిత్రంలో దేవదాసిగా సాయిపల్లవి
  • నల్లగా ఉందంటూ తమిళ మీడియాలో కథనం
  • గతంలో తనను కూడా విమర్శించారన్న తమిళిసై
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయిపల్లవి దేవదాసిగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు మైత్రి. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కాగా, తమిళ మీడియాలో సాయిపల్లవి గురించి ప్రచురించిన కథనం చర్చనీయాంశంగా మారింది. దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందవిహీనంగా ఉందన్నది ఆ వార్త సారాంశం.

ఈ విధంగా సాయిపల్లవిపై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గతంలో తాను కూడా ఇలాంటి వేదన అనుభవించానని వెల్లడించారు. సాయిపల్లవి రూపాన్ని విమర్శించడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి మాటలు ఎదుర్కొన్నవారికే ఆ బాధ తెలుస్తుందని, కానీ, పట్టుదల, శ్రమ, ప్రతిభతో అలాంటి మాటలను అధిగమించానని తమిళిసై వివరించారు.

పొట్టిగా, నల్లగా పుట్టడం మన తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రతిదాంట్లోనూ అందం ఉంటుందని, కాకి పిల్ల కాకికి ముద్దే కదా! అని వ్యాఖ్యానించారు. ఈ సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్ కు గురవుతున్నారని, పురుషులకు 50 ఏళ్లు వచ్చినా వారిని యువకులుగా చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎదుగుతుంటే ఇలాంటి మాటల ద్వారా అడ్డుకుంటుంటారు అని తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


More Telugu News