ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి

  • జీవో నెం.317 రగడ
  • గుండెపోటుతో మరణించిన ఉపాధ్యాయుడు
  • ప్రభుత్వం నుంచి పరామర్శకు ఎవరూ రాలేదన్న రేవంత్
  • తాను వస్తే పోలీసులతో నిర్బంధించారని ఆరోపణ
ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఆయన జీవో నెం.317పై తీవ్ర మనస్తాపం చెంది మరణించాడని రాజకీయవర్గాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. జైత్రం నాయక్ కుటుంబాన్ని ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రాక్షసపాలన నడుస్తోందని విమర్శించారు. జీవో నెం.317ని వెంటే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోనూ దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు.

ట్విట్టర్ లోనూ రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుడి మరణంపై స్పందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ చనిపోయి నెలరోజులు అవుతున్నా ప్రభుత్వం తరఫు నుంచి పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఇవాళ తాను పరామర్శకు వస్తే పోలీసులతో నిర్బంధించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

జీవో నెం.317ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండూ సమస్యను మరింత జటిలం చేసి లబ్ది పొందాలనుకుంటున్నాయని పేర్కొన్నారు.


More Telugu News