మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశం.. కొందరు ఐఏఎస్ లు అతిగా ప్రవర్తిస్తున్నారు: ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు

  • రాత్రి పూట తీసుకొచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాల్సిందే
  • మంత్రివర్గ ఉప సంఘం సమస్యను జటిలం చేస్తోంది
  • చిన్న సంఘాలతో చర్చలు జరుపుతూ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు
ఏపీలో కొత్త జిల్లాలను ప్రకటించడంతో ఇప్పుడు అందరి చర్చ దాని మీదే కేంద్రీకృతమైంది. ప్రతి ఒక్కరూ ఆ అంశం గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని అన్నారు.

అసలు కొత్త జిల్లాల ప్రక్రియను ఎప్పుడో చేపట్టాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏం చేసినా తమ ఉద్యమం పక్కదోవ పట్టబోదని అన్నారు. రాత్రి పూట తీసుకొచ్చిన చీకటి జీవోలను ప్రభుత్వం రద్దు చేయాలని అన్నారు. ఉద్యోగులందరికీ ఈ నెల పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంత్రి మండలి ఉప సంఘం సమస్యను మరింత జటిలం చేస్తోందని... ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తోందని బండి శ్రీనివాసరావు విమర్శించారు. ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు జరుపుతామంటూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రివర్గ ఉపసంఘం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసి, చర్చలు జరుపుతోందని, ఇది సరికాదని అన్నారు. కొందరు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రేపటి నుంచి వారి దగ్గర పని చేసేందుకు ఉద్యోగులు ఉండరనే విషయాన్ని సదరు ఐఏఎస్ లు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.


More Telugu News