హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంపై కాలుష్యం కాటు: తాజా అధ్యయనంలో వెల్లడి

  • ఏడాదిలో భారీగా పెరిగిన పీఎం 2.5, పీఎం 10 కాలుష్యం
  • హైదరాబాద్, విశాఖపట్నంలో పరిమితికి మించి ఆరేడు రెట్లు
  • విజయవాడలో నాలుగు రెట్లు అధికం
  • హైదరాబాద్ లో సగం వాహనాల నుంచే
దక్షిణాదిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కాలుష్యం గణనీయంగా పెరిగినట్టు గ్రీన్ పీస్ ఇండియా అనే సంస్థ ప్రకటించింది. 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ మధ్య ఈ పట్టణాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5, పీఎం 10 బాగా పెరిగినట్టు తెలిపింది. దక్షిణ భారత దేశంలో ఇతర పట్టణాలతో పోలిస్తే పీఎం 2.5, పీఎం 10 కాలుష్యం (ధూళి, వాయు ఉద్గారాలు) విశాఖపట్నంలో అత్యధికంగా ఉంటే, తర్వాత హైదరాబాద్ లోనే గరిష్ఠ స్థాయిలో ఉన్నట్టు గ్రీన్ పీస్ పేర్కొంది.

దక్షిణాదిన 10 పట్టణాల్లోని కాలుష్యంపై గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనం చేసి ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి స్థాయి (క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రో గ్రాములు) కంటే ఆరేడు రెట్లు విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిపింది. విజయవాడలో కాలుష్యం పరిమితి కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్ లో సగం కాలుష్యం వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాల నుంచే ఉంటోందని వెల్లడించింది.

ఆర్థిక కార్యకలాపాలు సన్నగిల్లిన తరుణంలోనూ 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ మధ్య కాలంలో కాలుష్యం పెరిగిపోవడం అన్నది ప్రజారోగ్య సంక్షోభమని గుర్తు చేస్తున్నట్టు గ్రీన్ పీస్ ఇండియా సంస్థ పేర్కొంది. అధిక కాలుష్యం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కాలేదని వ్యాఖ్యానించింది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి గణాంకాలను సేకరించి ఈ నివేదికను గ్రీన్ పీస్ ఇండియా రూపొందించింది. బెంగళూరు, చెన్నై, మైసూరు, మంగళూరు, కోయంబత్తూర్, కొచ్చి, పుదుచ్చేరి పట్టణాలను అధ్యయనం కింద పరిగణనలోకి తీసుకుంది.


More Telugu News