దేశంలో రెండు రోజులపాటు వర్షాలు, చలిగాలులు.. హెచ్చరించిన ఐఎండీ

  • గత మూడు నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పు
  •  మరో రెండు రోజులపాటు వణికించనున్న తీవ్ర చలిగాలులు
  • జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, హిమపాతానికి అవకాశం
గత మూడు నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి చంపేస్తోంది. దీంతో పొద్దెక్కినా బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వాతావరణంలో వచ్చిన ఈ అనూహ్య మార్పు కారణంగా దాదాపు రోజంతా చల్లగానే ఉంటోంది. అయితే, ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. పలు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, తీవ్ర చలిగాలులు వణికించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

అలాగే, 29, 31 తేదీల్లో జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.


More Telugu News