కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు

  • ఏపీలో ఇక 26 జిల్లాలు
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు
  • ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సజ్జల
  • వైసీపీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం కూడా కొత్త జిల్లాలకు ఆమోదం తెలపడంతో, తదుపరి కార్యాచరణ ఊపందుకుంది. కొత్తగా ఏర్పడిన పలు జిల్లాలకు అన్నమయ్య, ఎన్టీఆర్, శ్రీ బాలాజీ, శ్రీ సత్యసాయి జిల్లాల పేరిట నామకరణం చేయడం పట్ల పెద్దఎత్తున సానుకూల స్పందనలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నూతన జిల్లాల ఏర్పాటుపై మరికొన్ని వివరాలు తెలిపారు. కొత్త జిల్లాల అంశాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ గౌరవించారని తెలిపారు.


More Telugu News