భారత వినాశక చర్యల్లో పావులా మారొద్దు.. ట్విట్టర్ కు రాహుల్ ఘాటు లేఖ

  • గతంలో తన ఖాతాను బ్లాక్ చేయడంపై అసహనం
  • ఫాలోవర్ల సంఖ్య తగ్గడంపై సీఈవో పరాగ్ అగర్వాల్ కు ప్రశ్న
  • అన్యాయంగా తన ఖాతానే బ్లాక్ చేశారంటూ ఆరోపణ
  • తన గొంతు నొక్కేందుకు ట్విట్టర్ పై ప్రభుత్వ ఒత్తిడి అని వ్యాఖ్య
  • ఖాతా అన్నాక ఫాలోవర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులుంటాయన్న ట్విట్టర్
భారత్ సిద్ధాంత వినాశనంలో పావు కావొద్దని ట్విట్టర్ కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హితవు చెప్పారు. ట్విట్టర్ తనకు తెలియకుండానే వాక్ స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు ఆయన లేఖ రాశారు. గత ఏడాది డిసెంబర్ 21న రాసిన ఆ లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మొదటి ఏడు నెలల్లో తన ఫాలోవర్లు సగటున 4 లక్షలు పెరగ్గా.. ఆగస్టులో తన అకౌంట్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన తర్వాత పెరుగుదల ఆగిపోయిందని గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖాతాలతో తన ఖాతాను పోల్చి ట్విట్టర్ కు ఆయన వివరించారు. ‘‘వంద కోట్ల మందికి పైగా భారతీయుల తరఫున నేను ఈ లేఖను రాస్తున్నాను. దేశ వినాశనాన్ని కోరే వారి చేతిలో  పావులాగా మారరాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

‘‘నా ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేసినప్పుడు నేను ఢిల్లీలో రేప్ బాధితురాలి తరఫున పోరాడాను. ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసిన అనేక అంశాలమీద గొంతు విప్పాను. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో నేను పోస్ట్ చేసిన ఓ వీడియోను రికార్డ్ స్థాయిలో ఎక్కువ మంది చూశారు. ఏ రాజకీయ నాయకుడు పోస్ట్ చేసిన వీడియోలకూ ఇప్పటిదాకా అంతలా రెస్పాన్స్ రాలేదు’’ అని అన్నారు.

తన గొంతును నొక్కేందుకు ట్విట్టర్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు ట్విట్టర్ సిబ్బంది కొందరు తనకు చెప్పారని ఆరోపించారు. కొన్నిరోజుల పాటు తన ఖాతానూ అన్యాయంగా నిలిపేశారని, తనతో పాటు కొన్ని ప్రభుత్వ శాఖల ట్విట్టర్ ఖాతాలు, మరికొందరు అవే ఫొటోలు పోస్ట్ చేసినా వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. తన ఒక్కడి ఖాతానే బ్లాక్ చేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

అయితే, రాహుల్ లేఖకు ట్విట్టర్ కూడా అదే రీతిలో సమాధానమిచ్చింది. మోసపూరితమైన మార్పులు, స్పామ్ ను తాము అస్సలు సహించబోమని ట్విట్టర్ ప్రతినిధి స్పష్టం చేశారు. తప్పుడు ఆటోమేషన్, స్పామ్ పై తాము మెషీన్ లెర్నింగ్ టూల్స్ సాయంతో వ్యూహాత్మకంగా పోరాడుతున్నామని చెప్పారు. తద్వారా ఆరోగ్యవంతమైన సేవలు, నమ్మదగిన ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఖాతా అన్నాక ఫాలోవర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.


More Telugu News