అన్ని శాఖల సేవలు ఇక ఒకేచోట.. 'ఏపీ సేవ' పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్!

  • అన్ని సేవలను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్ ను తీసుకొచ్చామన్న జగన్
  • రెండేళ్లుగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో చూపించామన్న సీఎం
  • ప్రజా సేవలో గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాల ద్వారా పరిపాలనను మరింత చేరువ చేసేందుకు 'ఏపీ సేవ' పోర్టల్ ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ను తాడేపల్లిలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్ ను తీసుకొచ్చామని చెప్పారు. సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని, దీనికి 'ఏపీ సేవ' అనే పేరును పెట్టామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం వేగంగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలు పొందేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. మనకున్న వ్యవస్థను మెరుగుపరుచుకునే క్రమంలో ఇదొక ముందడుగని తెలిపారు.

డాక్యుమెంట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని సీఎం చెప్పారు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తుందని... ఆన్ లైన్లోనే దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏపీ సేవ పోర్టల్ ద్వారా మరింత వేగంగా సేవలు అందుతాయని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఏ అధికారి వద్ద తమ ఫైల్ ఉంది అనేది లబ్ధిదారునికి తెలుస్తుందని... ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుందని తెలిపారు.

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో అందరికీ తెలిసేలా గత రెండేళ్ల కాలంలో అడుగులు ముందుకేశామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలను అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. 4 లక్షల మంది సిబ్బంది నిరంతరం ప్రజా సేవలో ఉంటున్నారని... గ్రామ స్వరాజ్యానికి ఇంతకంటే నిదర్శనం లేదని చెప్పారు.


More Telugu News