‘ఒమిక్రాన్’ సోకడంతో వచ్చే రోగ నిరోధక శక్తితో.. ‘డెల్టా’ సహా అన్ని వేరియంట్లు ఖతం: ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

  • రీ ఇన్ ఫెక్షన్ కాకుండా రక్షణ
  • ఒమిక్రాన్ ఆధారిత టీకా విధానాలను అమలు చేయాలి
  • ఒమిక్రాన్ పేషెంట్లపై సైంటిస్టుల అధ్యయనం
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైపోయింది. డబ్ల్యూహెచ్ వో కూడా ఇప్పటికే ఇదే విషయాన్ని చెప్పింది. చాలా మంది దాని బారిన పడ్డారు. అయితే, అది మంచిదే అంటున్నారు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైంటిస్టులు. సెకండ్ వేవ్ లో ప్రపంచాన్ని గడగడలాడించిన ‘డెల్టా’ వేరియంట్ కొమ్ముల్ని అది విరిచేస్తోందట. అవును, ఒమిక్రాన్ సోకిన వాళ్లలో వచ్చే రోగనిరోధక శక్తితో.. ‘డెల్టా’, ఒమిక్రాన్ తో పాటు మిగతా అన్ని వేరియంట్ల నుంచీ మెరుగైన రక్షణ లభిస్తోందని ఐసీఎంఆర్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.

ఒమిక్రాన్ ఇన్ ఫెక్షన్ తో శరీరంలో పుట్టిన ప్రతిరక్షకాలు.. డెల్టా, ఆల్ఫా, బీటా, గామా వంటి వేరియంట్లను అడ్డుకోవడంతో పాటు రీఇన్ ఫెక్షన్ రాకుండా రక్షణనిస్తున్నాయని వారి స్టడీ తేల్చింది. దీంతో డెల్టా డామినేషన్ తగ్గిపోయిందని, ఒమిక్రాన్ ప్రభావమే ఎక్కువైందని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఒమిక్రాన్ ఆధారిత వ్యాక్సిన్ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది.

ఒమిక్రాన్ సోకిన 39 మందిపై ఐసీఎంఆర్ ఈ స్టడీ చేసింది. అందులో 25 మంది ఆస్ట్రాజెనికా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. మరో 8 మంది ఫైజర్ రెండు డోసులు వేసుకున్నారు. ఆరుగురు అసలు ఏ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. స్టడీలో పాల్గొన్నవారిలో 28 మంది ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారున్నారు. కొంత మంది టీనేజర్లూ ఉన్నారు. వారిలో ఐజీజీ ప్రతిరక్షకాలతో పాటు వైరస్ ను మట్టుబెట్టే న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను విశ్లేషించారు. అందరిలోనూ న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలు.. అన్ని వేరియంట్లను సమర్థంగా నివారించాయని నిర్ధారించారు. ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురణ కోసం ఈ స్టడీని పంపించారు.


More Telugu News