వెస్టిండీస్‌తో వన్డేలు, టీ20లకు భారత జట్టు ఎంపిక.. దీపక్ హుడాకు పిలుపు

  • ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో సిరీస్
  • కుల్దీప్ యాదవ్‌కు తిరిగి జట్టులో చోటు
  • అశ్విన్‌కు ఏ జట్టులోనూ దక్కని స్థానం
  • జట్టును నడిపించనున్న రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో స్వదేశంలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, 21 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. అలాగే, రాజస్థాన్ హిట్టర్ దీపక్ హుడా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో జడేజా సెలక్షన్‌కు దూరమయ్యాడు.

పేసర్లు బుమ్రా, షమీలకు విశ్రాంతి నివ్వగా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో హార్దిక్ పాండ్యాకు కూడా జట్టులో స్థానం లభించలేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వన్డే జట్టును నడిపించిన కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి జట్టులోకి వస్తాడు. భువనేశ్వర్‌ కుమార్‌కు టీ20ల్లో మాత్రమే స్థానం లభించగా, సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఏ జట్టులోనూ అతడికి చోటు లభించలేదు. వచ్చే నెల 6, 9, 11న జరగనున్న వన్డే సిరీస్‌కు అహ్మదాబాద్ వేదిక కానుండగా, ఫిబ్రవరి 16, 18, 20న జరగనున్న టీ20లకు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది.

వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ధావన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్

టీ20 జట్టు: రోహిత్, రాహుల్, కిషన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్


More Telugu News