అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ అసంతృప్తి!

  • రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్
  • రాజంపేట ప్రజలను సంప్రదించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్న
  • ఇలా అయితే తాము ప్రజల్లో తిరగలేమని వ్యాఖ్య
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు రాయచోటిని కేంద్రంగా ప్రకటించడంపై వైసీపీ నేత, రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

రాజంపేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య పుట్టిన ప్రాంతాన్ని కాకుండా వేరే ప్రాంతాన్ని ప్రకటించారని విమర్శించారు. ఇలా జరిగితే తాము ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పారు. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుందని అన్నారు. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించాలని, లేదా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకిస్తూ రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లాపరిషత్ ఛైర్మన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News