ఈసారి గణతంత్ర వేడుకల కవాతులు, విన్యాసాలు స్పెషల్.. ఇవన్నీ తొలిసారే!

  • ఆర్మీ నుంచి ఆరు కంటింజెంట్ల కవాతు
  • తొలిసారిగా 1971 యుద్ధంలో వాడిన ట్యాంకుల ప్రదర్శన
  • పాత యూనిఫాంలతో ఆర్మీ మార్చ్
  • 75 యుద్ధ విమానాలతో గగన విన్యాసాలు
  • రాఫెల్ కేంద్రంగా 75 అంకె వచ్చేలా ఫార్మేషన్
  • యుద్ధ విమానం కాక్ పిట్ నుంచి తొలిసారి వీడియో చిత్రీకరణ
ఈసారి గణతంత్ర వేడుకలు చాలా చాలా ప్రత్యేకమే. ఈసారి 75వ స్వతంత్ర భారతంలో వేడుకలు జరగడం ఒక కారణమైతే.. పరేడ్ చేసిన చాలా కంటింజెంట్లలో తొలిసారి చేసిన విన్యాసాలు మరో కారణం. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో మార్పులు జరిగిన తీరు, ఆయుధాల ఆధునికీకరణ, 75 యుద్ధ విమానాలతో అబ్బురపరిచే గగన విన్యాసాలను తొలిసారి ప్రదర్శించారు. అంతేకాదు.. యుద్ధ విమానం కాక్ పిట్ నుంచి తొలిసారి విన్యాసాలను చిత్రీకరించారు. అంతేగాకుండా ‘అమరులకు శతకోటి వందనాలు’ పేరిట తొలిసారి ఎన్ సీసీ కార్యక్రమం నిర్వహించింది.

ఆర్మీకి చెందిన ఆరు కంటింజెంట్లు పరేడ్ లో పాల్గొన్నాయి. రాజ్ పుత్ రెజిమెంట్, అస్సాం రెజిమెంట్, జమ్మూ కశ్మీర్ లైట్ రెజిమెంట్, సిక్ లైట్ రెజిమెంట్, ఆర్మీ ఆర్డ్ నెన్స్ కోర్, పారాచూట్ రెజిమెంట్ లు ప్రదర్శనలు చేశాయి. ఆర్మీ పరేడ్ లో భాగంగా 61 కవల్రీ, 14 నిలువు వరుసలతో మార్చ్ చేశారు. ఆర్మీకి చెందిన లైట్ హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు.

1971 యుద్ధంలో కీలకభూమిక పోషించిన యుద్ధ ట్యాంకులు పీటీ 76, సెంచూరియన్ లను తొలిసారి ప్రదర్శించారు. వాటితో పాటు ఎంబీటీ అర్జున్ ఎంకే 1, ఏపీసీ టోపాస్, బీఎంపీ 1, రెండు బీఎంపీ 2, 75/24 గన్, ధనుష్ గన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థ, టైగర్ క్యాట్ క్షిపణి, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను ప్రదర్శించారు. రాజ్ పుత్ రెజిమెంట్ .. 1947లో ఇండియన్ ఆర్మీ ధరించిన యూనిఫాంలో దర్శనమిచ్చి వింటేజ్ .303 రైఫిళ్లు చేబూని కవాతు చేసింది. 1962 సమయంలో ఆర్మీ ధరించిన యూనిఫాంతో అస్సాం రెజిమెంట్ కవాతు చేసింది. పారాచూట్ రెజిమెంట్ కొత్తగా తీసుకురానున్న యూనిఫాంతో విన్యాసాలు చేసింది.

లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ నేతృత్వంలోని 96 మంది యువ నావికులు, నలుగురు అధికారులు నావికాదళం తరఫున కవాతులో పాల్గొన్నారు. భారత నౌకా దళ బహుళ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శకటాన్ని ప్రదర్శించారు. వైమానికదళ విన్యాసాల్లో భాగంగా 75 యుద్ధ విమానాల్లో గగనతలంలో యుద్ధ విన్యాసాలు చేశాయి. రాఫెల్ జెట్ కేంద్రంగా.. 75 అంకె వచ్చేలా ఫార్మేషన్ చేశాయి. ఇక, యుద్ధ విన్యాసాల్లో భాగంగా తొలిసారి కాక్ పిట్ నుంచి వీడియో తీశారు. రాఫెల్ తో పాటు సుఖోయ్, జాగ్వార్, ఎంఐ 17, సారంగ్, అపాచీ, డకోటా యుద్ధ విమానాలూ విన్యాసాల్లో పాల్గొన్నాయి.


More Telugu News