భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన టెక్కీలు వీరు!

  • అడోబ్, ఐబీఎం సారథులూ మనవారే
  • కింది స్థాయి నుంచి ఎదిగినవారే
  • ప్రతిభతో ఉన్నత పదవుల అలంకరణ
  • కీలక బాధ్యతల్లో దీర్ఘకాలంగా రాణింపు
గూగుల్ మాతృసంస్థ ఆల్భాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడం ద్వారా.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వారిని గుర్తించినట్టయింది. విదేశాల్లో పనిచేస్తున్న ఎంతో మంది భారత సంతతి నిపుణులకు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. పిచాయ్, సత్యతోపాటు భారత ప్రతిభకు ఐకాన్లుగా మారిన వారు ఇంకా చాలా మందే ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకునే ప్రయత్నమే ఇది.

పరాగ్ అగర్వాల్
ట్విట్టర్ సీఈవోగా ఇటీవలే కొత్త బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా 2011 నుంచి పనిచేశారు. ట్విట్టర్ లో చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్ టీ, యాహూ సంస్థలకు సేవలు అందించారు. ఐఐటీ బాంబే ఇంజనీరింగ్ విద్యార్థి అయిన అగర్వాల్ అమెరికాలో మాస్టర్స్ చేశారు.

సుందర్ పిచాయ్
ప్రపంచాన్ని గూగుల్ శాసిస్తుంటే, ఆ గూగుల్ ను మన భారతీయుడు పిచాయ్ ఏలుతుండడం మనకు నిజంగా గర్వకారణమే. 2019 నుంచి ఆల్ఫాబెట్ సీఈవోగా కొనసాగుతున్నారు. 2014లో గూగుల్ హెడ్ గా ఆయన బాధ్యతల్లోకి వచ్చారు. గూగుల్ లో 15 ఏళ్ల కాలంలో ఎన్నో ముఖ్య బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం.

ఆండ్రాయిడ్, క్రోమ్, మ్యాప్స్ తదితర కీలక ప్రాజెక్టుల వెనుక పిచాయ్ ప్రతిభ దాగుంది. అందుకే గూగుల్ వ్యవస్థాపకులు పిచాయ్ సామర్థ్యాలపై అపార నమ్మకంతో కీలక సారథ్య బాధ్యతలు అప్పగించారు. పిచాయ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, వార్టన్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకున్నారు.

సత్య నాదెళ్ల
హైదరాబాద్ లో జన్మించి, అక్కడే విద్యను పూర్తి చేసుకున్న సత్య నాదెళ్ల.. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్ లో 1992లో తన కెరీర్ ను మొదలు పెట్టి, 2014లో సీఈవో బాధ్యతలు స్వీకరించారు.

శంతను నారాయణ్
అడోబ్ సీఈవో అయిన శంతను నారాయణ్ కూడా హైదరాబాదీనే. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ చదివిన ఆయన.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా నుంచి ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పట్టాలు అందుకున్నారు. 1998లో ఆడోబ్ లో చేరిన నారాయణ్ 2005లో సీవోవో, 2007లో సీఈవోగా పదోన్నతి పొందారు.

అరవింద్ కృష్ణ
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎం సీఈవో అయిన అరవింద్ కృష్ణ ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో పీహెచ్ డీ చేశారు. ఐబీఎంతో 30 ఏళ్లుగా కలసి నడుస్తున్నారు. 2020 ఏప్రిల్ లో సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

నిఖేశ్ అరోరా
2018లో పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవోగా చేరారు. కేలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే బహుళజాతి సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇది. అంతకుముందు వరకు గూగుల్, సాఫ్ట్ బ్యాంకులో పని చేశారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, నార్తర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, బోస్టన్ కాలేజీ నుంచి మాస్టర్స్ కోర్సులను పూర్తి చేశారు.

అంజలి సూద్
వీడియో షేరింగ్, హోస్టింగ్ కంపెనీ ‘విమియో’ సీఈవో అంజలీ సూద్ 2017 నుంచి అదే బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. అంతకుముందు వరకు జనరల్ మేనేజర్, మార్కెటింగ్ హెడ్ గా పనిచేశారు. విమియోలోకి రాక ముందు అమెజాన్, టైమ్ వార్నర్ సంస్థల్లో పని చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. సూద్ డెట్రాయిట్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు.

సంజయ్ మెహరోత్రా
కంప్యూటర్ హార్డ్ వేర్ ఉత్పత్తులకు పేరొందిన మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా సంజయ్ మెహ్రోత్రా పనిచేస్తున్నారు. మనం ఫోన్లలో వినియోగించే మొమొరీ కార్డుల కంపెనీ శాన్ డిస్క్ సహ వ్యవస్థాపకుడు. దీన్ని 2016లో వెస్టర్న్ డిజిటల్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మైక్రాన్ టెక్నాలజీకి మారిపోయారు. కాన్పూర్ లో జన్మించిన మెహ్రోత్రా బిట్స్ పిలానీలో చదువుతూనే 18 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఇంటెల్ లోనూ పనిచేశారు.

ఇతరులు
ఫ్లెక్సీ సీఈవో రేవతి అద్వైతి.. అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్.. నెట్ యాప్ సీఈవో జార్జ్ కురియన్.. వర్క్ డే సీఈవో అనీల్ భూశ్రీ.. నార్టన్ లైఫ్ లాక్ ప్రెసిడెంట్ సమీర్ కపూరియా.. గోడాడీ సీఈవో అమన్ భూటాని.. క్యాడెన్స్ డిజైన్ ప్రెసిడెంట్ అనిరుధ్ దేవ్ గన్.. వెస్టర్న్ డిజిటల్ ప్రెసిడెంట్ శివ శివరామ్.. వీఎంవేర్ సీఈవో రఘురామ్ కూడా భారత సంతతివారే.


More Telugu News